అమిత్ షాకు క్లీన్‌చిట్ ఇచ్చేశారు!
ముజఫర్‌నగర్: 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. ముజఫర్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్‌షా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూపీ పోలీసులు కాక్రోలి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
'అయితే ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు' అంటూ పోలీసులు బుధవారం తుది నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికపై మేజిస్ట్రేట్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. 2014 ఏప్రిల్ 4న బర్వార్ గ్రామంలో అమిత్ షా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 'ముల్లా' ములాయం ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ ముస్లింలనే ఓటుబ్యాంకుగా చూస్తున్నదని, ఇతర వర్గాలు ఓటేయక్కున్నా పర్వాలేదని ప్రవర్తిస్తున్నదని షా పేర్కొన్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు తెలిపారు.