
మూడేళ్లు అధికారంలో కొనసాగిన అనంతరం జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి పీడీపీతో విభేదాలు తీవ్రమవడంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మెహబూబా ముఫ్తీ సీఎంగా కొనసాగిన పక్షంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై కేంద్రం కఠిన వైఖరిని అవలంబించడం కుదరదని బీజేపీ భావించడం, రంజాన్ మాసంలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాల్సిందిగా ముఫ్తీ పట్టుబట్టడం, రంజాన్ నెల ముగిశాక కూడా సైనిక కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై పీడీపీ అసంతృప్తిగా ఉండటంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు ఇటీవల మరింతగా దెబ్బతిన్నాయి.
♦ కఠువాలో బాలికపై హత్యాచారం విషయంలో పోలీసుల విచారణను పీడీపీ సమర్థించిగా, బీజేపీ ప్రాంతీయ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
♦ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆర్మీని బీజే పీ ప్రశంసించగా, పీడీపీ మాత్రం వ్యతిరేకించింది.
♦ భద్రతా దళాలపై తొలిసారి రాళ్లు విసిరిన వారిపై కేసులను ఉపసంహరించాలని నిర్ణయించడం.
♦ ఉగ్రవాదులకు నిధుల సేకరణ కేసులో పలువురు హురియత్ సభ్యుల ప్రమేయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)విచారణ జరపడం.
♦ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్–370ని బీజేపీ గతంలో తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తర్వాత దానిపై మాట్లాడలేక పోవడం.