
సాక్షి, సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విస్పష్ట ఆధిక్యంతో పాలనా పగ్గాలు చేపడుతుందని అక్టోబర్ 23 నుంచి 30 వరకూ నిర్వహించిన పీపుల్స్ పల్స్ సర్వేలో స్పష్టమైంది. ప్రేమ్‌కుమార్ ధుమాల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ 39-44 సీట్లు గెలుపొందుతుందని, కాంగ్రెస్ 19-24 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమవుతుందని సర్వేలో వెల్లడైంది. ఎగువ, దిగువ హిమాచల్ ప్రాంతాల్లోనూ బీజేపీ మంచి ఆధిక్యం కనబరుస్తుందని సర్వే స్పష్టం చేసింది. మరోవైపు సీపీఎం తొలిసారిగా హిమాచల్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేతో అడుగుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇద్దరు నుంచి నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించనున్నారని అంచనా వేసింది.
ప్రభుత్వ వ్యతిరేకత లేకున్నా..
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వెల్లడవడం గమనార్హం. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలని భావిస్తున్నారని సర్వే ప్రశ్నించగా బీజేపీ సీఎం అభ్యర్థి ధుమాల్ వైపు 34 శాతం మంది మొగ్గుచూపగా, వీరభద్రసింగ్‌ను 33 శాతం ఓటర్లు ఎంచుకున్నారు. వీరిద్దరి మధ్య తేడా కేవలం ఒక శాతమే. మరోవైపు సీఎంగా వీరభద్రసింగ్ పనితీరును 32 శాతం మంది ప్రశంసించగా, 41 శాతం మంది ఫరవాలేదని, కేవలం 26 శాతం మందే బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఇక హిమాచల్ అభివృద్ధికి ఏ పార్టీ సరైనదని భావిస్తున్నారన్న ప్రశ్నకు బీజేపీ సరైనదని 41.4 శాతం మంది పేర్కొనగా, కాంగ్రెస్ వైపు 37.5 శాతం మంది మొగ్గుచూపారు.
మూడు శాతం ఓట్లతో మారిన మూడ్
బీజేపీ, కాంగ్రెస్‌లకు పోలయ్యే ఓట్ల వ్యత్యాసం కేవలం మూడు శాతమేనని ఈ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 46.9 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43.5 శాతం, ఇతరులకు 9.6 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. ఇరు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం మూడు శాతమే అయినా వీరభద్రసింగ్ సర్కార్‌ను కూలదోసి బీజేపీ నేతృత్వంలోని దుమాల్‌కు పట్టం కట్టేలా సీట్లలో భారీ తేడా వస్తుందని తెలిపింది.
నిరుద్యోగమే ప్రధానాంశం
హిమాచల్ ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్‌గా మారలేదు. జాతీయ నేతల ప్రభావమూ లేదు. నిరుద్యోగం ఎన్నికల ప్రధానాంశంగా భావిస్తున్నామని 28.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలే తమను కలవరపెడుతోందని 21.5 శాతం మంది చెప్పుకొచ్చారు. గిట్టుబాటు ధరలే ప్రధానాంశమని 16 శాతం, రాష్ట్ర అభివృద్ధే కీలకాంశమని 12 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. అవినీతి ప్రధానాంశమని 8 శాతం మంది చెప్పగా నోట్ల రద్దు, జీఎస్‌టీ ఇబ్బందులను 5.8 శాతం మంది ప్రస్తావించారు. ఇక విద్య, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులే ఎన్నికల అంశాలని ఏడు శాతం మంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment