
అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీకి లడ్డూ తినిపిస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం జరిగిన తొలి పార్టీ నేతల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీని సహచర సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రధానికి లడ్డూలు తినిపించగా, ఇతర నేతలు పూల దండలతో సత్కరించారు. ప్రతిపక్షాలు చేపట్టిన అవిశ్వాసం పసలేనిదని, వారు ఎలాంటి సన్నద్ధం లేకుండా అవిశ్వాసంతో సభ ముందుకొచ్చారని పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ ప్రధాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అనంత్ కుమార్, నితిన్ గడ్కరీ, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ వంటి అగ్రనేతలు ఆశీనులయ్యారు.
గత సమావేశాలకు భిన్నంగా ఎన్నికల వేళ ఐక్యతను చాటేలా దిగ్గజ నేతలంతా వేదికపై ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.మరోవైపు ఎస్‌సీ, ఎస్‌టీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాసిన యూపీకి చెందిన దళిత ఎంపీ అశోక్ దోహ్రే ప్రధాని మోదీకి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించబోగా ఆయన వారించారు.
Comments
Please login to add a commentAdd a comment