కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి.
పింప్రి, న్యూస్‌లైన్ : కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. పుణే, పింప్రి-చించ్‌వడ్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. వర్షాలు, చల్లటి గాలులు, మరో పక్క ఎండ కూడా కాయడంతో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరాలతోపాటు డెంగీ, మలేరియా లాంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నాలుగు రోజుల్లో రోగాల బారిన పడిన వారి సంఖ్య మరింత ఎక్కువైంది.
జూన్‌లో కురవాల్సిన వర్షాలు జూలైలో కురుస్తుండడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా విస్తృతంగా వ్యాప్తి చెందడం ద్వారా నగర ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లతోపాటు నగర ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యుడు రవీంద్ర ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు
కలుషిత నీటిని తాగడం ద్వారా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులు, జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నీటిని మరిగించి, చల్లార్చి, వడపోసిన తర్వాత సేవించాలి.
బయటి తినుబండారాలను, పులిసిన పుల్లటి పదార్థాలను, వీలైనంత వరకు మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి, నూనె పదార్థాలను తగ్గించాలి, సులువుగా జీర్ణమయ్యే వాటినే ఎక్కువగా తీసుకోవాలి. సూప్‌లను తరచూ తాగాలి.
ముఖ్యంగా ఇలాంటి వాతావరణంలో సొంటి, తులసి, మిరియాలు, లవంగాలు ఉపయోగించాలి. ఆహార పదార్థాలలో సూప్‌లలో వీటిని వినియోగించాలి
స్వచ్ఛమైన గాలిని ఇచ్చే తుసి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. తులసి మొక్కలు 24 గంటలు ఆక్సీజన్ గాలిలోకి విడుదల చేస్తాయి. దోమలు కూడా పరిసరాలలోకి రావు. తులసిని సేవించడం డెంగీ నివారణకు దోహదపడుతోంది.