మినరల్ వాటర్ తాగుతున్నారా..? జరభద్రం..!
సాధారణంగా రోడ్డుపై వెళుతున్నప్పుడు దాహం వేస్తే ఏం చేస్తాం? దగ్గర్లో ఉన్న స్టోర్లో వాటర్ ప్యాకెట్ కొంటాం. ఎక్కువ మంది ఉంటే వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుతాం. కానీ, ఇక ముందు అలా చేయొద్దని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్ హెచ్చిరిస్తోంది. వాటర్ బాటిళ్లలో నిల్వ ఉంచే నీరుపై చేసిన పరిశోధనలో.. ఆ నీటిలో కొలీఫాం బాక్టీరియా ఉంటున్నట్లు తెలిపింది.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి పెడుతున్న దాదాపు 20 రకాల వాటర్ బాటిళ్లను ఘజియాబాద్ నేషనల్ టెస్ట్ హౌస్ లో నిర్వహించిన పరీక్షల్లో బాటిళ్లలో ఈ విషయాన్ని కనుగొన్నారు. దీంతో స్పందించిన ఇండియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అనుమతులు లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ రూ.1,500 కోట్లకు చేరింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ బిజినెస్ స్టాండర్డ్స్(బీఐఎస్)కు ఈ మేరకు భారీగా ఫిర్యాదులు చేరినట్లు తెలిపింది. ప్రముఖ ఆహార సంస్థలే అక్రమంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను నడుపుతున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి.
బీఐఎస్ హాల్మార్క్ లేకుండా ఈ కంపెనీలు నీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే చర్యలు తీసుకున్నాయో? ఇప్పటివరకు ఎన్ని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారనే సమాచారన్ని తమకు అందించాలని బీఐఎస్ ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు వాటర్ అందించే సంస్థలకు లైసెన్స్ ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం దేశం మొత్తంలో 6,513 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలకు లైసెన్స్ లు జారీ అయ్యాయి.