
భిక్షమెయ్యలేదని... గొంతు కోసేశారు..
న్యూఢిల్లీ: అతి చిన్న వయసులోనే పిల్లల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలోని గోవింద్పురి ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కలకలం రేపింది. అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఒక పూల వ్యాపారిని బీర్సీసాతో గొంతు కోసి హత్యచేశారు భిక్షాటన చేసుకునే బతికే ఇద్దరు బాలురు.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఒక దేవాలయం దగ్గర పూలవ్యాపారం చేసుకుంటాడు సంజయ కుమార్. పక్కనే మరో షాపులో మద్యం సేవిస్తుండగా 9, 10 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలు భిక్షమడిగారు. దీనికి సంజయ్ నిరాకరించడంతో చంపేస్తామని బెదిరించారు. దీంతో కోపోద్రిక్తుడైన సంజయ్ ఒక బాలుడ్ని చెంపపై కొట్టాడు. అంతే పిల్లలిద్దరూ గొడవకు దిగి రెచ్చిపోయారు. ఒకడు బీరు సీసాతో నెత్తిమీద బలంమీద కొట్టాడు. మరొకడు కిందపడిపోయిన సంజయ్పైకి ఎక్కి కుర్చుని మరీ పగిలిన బీరు సీసాతో గొంతు కోసేశాడు. దీంతో బాధితుడు తీవ్రం రక్తం స్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆ పిల్లల్ని తోసి పారిపోవడానికి సంజయ్ ప్రయత్నించాడనీ, కానీ సగంవరకు గొంతు తెగిపోయి తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ తప్పి పడిపోయాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తాము ఆసుపత్రి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా సంజయ్ నిరాకరించాడని పక్క షాపు యజమాని రోహ్తస్ కుమార్ తెలిపారు. పోలీసులు వచ్చి తరలించేలోపే మరణించాడన్నారు.
కాగా రిక్షా కార్మికుల పిల్లలలైన నిందితులిద్దరూ సంవత్సరం క్రితం ఇంట్లోంచి పారిపోయి వచ్చి, కల్కాజీ గుడి దగ్గర బిక్షాటన చేస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించామని చెప్పారు.