
న్యూఢిల్లీ: శత్రుదేశాలతో యుద్ధాలను వీలైనంత త్వరగా గెలవడానికి ఆర్మీ, నావికాదళం, వాయుసేనలను కలిపి ఏకీకృత కమాండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా తెలిపారు. యుద్ధాల సమయంలో త్రివిధ దళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటే శత్రువులను చావుదెబ్బ తీయవచ్చని వెల్లడించారు. ఈ ఏకీకృత కమాండ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రంతో పాటు రక్షణశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు.
అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు ఈ విధానాన్ని ఇప్పటికే పాటిస్తున్నాయన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. చైనా తన సైన్యాన్ని ఐదు ఏకీకృత కమాండ్లుగా విభజించిందని తెలి పారు. భారత్‌లో మాత్రం 17 కమాండ్లు ఉన్నాయనీ, ఒక్క అండమాన్–నికోబార్ దీవుల్లో మాత్రం 2001లో వ్యూహాత్మక ఏకీకృత కమాండ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. రక్షణరంగంలో స్వయంసమృద్ధి సాధించడం ప్రతి దేశానికి కీలకమని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్‌లో దశలవారీగా ఆధునీకరణ చేపడుతున్నట్లు ధనోవా వెల్లడించారు.