
లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌కు మతిభ్రమించిందని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. మాయావతి నపుసంకురాలి కంటే హీనమని యూపీలోని మొఘల్‌సరాయ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధనా సింగ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.
లక్నో గెస్ట్ హౌస్‌లో మాయావతి సహా బీఎస్పీ కార్యకర్తలపై గతంలో ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని పరోక్షంగా ప్రస్తావించిన సాధనా సింగ్ ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల కలయికను తప్పుపడుతూ మాయావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని మిశ్రా వ్యాఖ్యానించారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ నేతలు మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై బీజేపీ నేత సాధనా సింగ్ వాడిన భాషే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment