
న్యూఢిల్లీ: చురుక్కుల్లేవ్.. చమక్కుల్లేవ్.. కవితలు లేవు.. పంక్తులు లేవు.. జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఎలాంటి ఛలోక్తులు లేకుండా అత్యంత సాదాసీదాగా సాగింది! బడ్జెట్‌లో చివర్లో వివేకానందుడి మాటలు తప్ప ఎక్కడా కవులు, ప్రముఖుల సూక్తులను ఉటంకించలేదు. గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆసాంతం.. రైతులు, పేదలు, గ్రామీణం, మహిళలు.. ఈ నాలుగు అంశాల చుట్టే తిరిగింది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రస్తావించే సమయంలో హిందీలో ప్రసంగించారు.
మిగతా వివరాలన్నీ ఇంగ్లిష్‌లోనే చెప్పారు. తమది ‘భారత్ కోణం’లో ఉన్న బడ్జెట్ అని చెబుతూ.. వీలైనచోటల్లా మోదీ లక్ష్యాలు, ఆశయాలను ప్రస్తావించారు. ‘‘ఈ దేశ అత్యున్నత స్థానంలో ఉన్న నాయకత్వం పేదల కష్టాలు, కన్నీళ్లను అతి దగ్గరి నుంచి చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మా నాయకత్వానికి తెలుసు. పేదలు, మధ్యతరగతి వర్గాలు మాకు కేస్‌స్టడీ మాదిరి కాదు.. ఎందుకంటే స్వయంగా మా నాయకత్వమే ఆయా వర్గాలకు చెందినది.
సుమారు 1.50 గంటలపాటు సాగిన జైట్లీ ప్రసంగంలో.. ‘రైతులు’ అన్న పదం 27 సార్లు, ‘పేదలు’ 21 సార్లు, ‘గ్రామీణం’ 20 సార్లు, ‘వ్యవసాయం’ 16 సార్లు, ‘మహిళలు’ 10 సార్లు ఉచ్చరించారు. వ్యవసాయ రంగం బలోపేతంతోపాటు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, ఉపాధి, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలపై దృష్టి సారించినట్లు వివరించారు.
ప్రసంగం చివరల్లో ‘మనం ఆశిస్తున్న ఉజ్వల భారతం తప్పకుండా ఆవిర్భవించి తీరుతుంది’ అంటూ వివేకానందుడు ఐరోపా యాత్రలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ‘‘రైతుల ఇళ్లల్లోంచి, వారి చేతుల్లోని నాగళ్లలోంచి, జాలర్ల పూరి గుడిసెల్లోంచి, అపార ప్రకృతి సంపదలోంచి భరతమాత ఉద్భవిస్తుంది..’’ అన్న వివేకానందుడి మాటలతో ప్రసంగాన్ని ముగించారు.
ఆర్థిక అవసరాలు తీరుస్తుంది
తమ బడ్జెట్ గ్రామీణం, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుందని అరుణ్‌జైట్లీ అన్నారు. ఆర్థికరంగ అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ద్రవ్యలోటును 3.2 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా జీఎస్‌టీ అమలు, ఇతరత్రా కారణాల వల్ల 3.5 శాతానికి సవరించాల్సి వచ్చింది..’’ అని వివరించారు.
బడ్జెట్ హైలైట్స్
♦ 2018–19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు అంచనా 3.3 శాతం.
♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు.
♦ ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్. భారత ఆర్థిక వ్యవస్థ విలువ రూ.160 లక్షల కోట్లు. త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుంది.
♦ ఖరీఫ్‌లో అన్ని పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు.
♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణాల సేకరణ అంచనా రూ.4.07 లక్షల కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.4.79 లక్షల కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment