ఈ నెల 22, 23 తేదీల్లో తొలి సమావేశం
- ఐఐటీ, ఐఐఎంల్లో పరిశోధనల కోసం నూతన సంస్థ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమలు చేసే పనిని వేగవంతం చేస్తూ.. జీఎస్‌టీ మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. జీఎస్‌టీ మండలి సచివాలయానికి కూడా ప్రధానిమోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే తొలి భేటీలో ఆర్థిక శాఖ సహాయమంత్రి, కేంద్ర రెవెన్యూ విభాగం ఇన్‌చార్జ్, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని పన్ను రేటు, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 22 లోగా పన్ను రేటు, మినహాయింపు వస్తువులు, అమలు తేదీని జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుంది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఈ మండలిలో ఎక్స్-అఫిషియో సభ్యుడిగా కొనసాగుతారని, అయితే ఓటు హక్కు ఉండదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు.
రాష్ట్రాల రెవెన్యూ, వాణిజ్య పన్నుల మంత్రులు లేదా ఇతర మంత్రులైవరినైనా జీఎస్టీ మండలికి సిఫార్సు చేయొచ్చన్నారు. కాగా, విద్యాసంస్థల్లో నూతనఆవిష్కరణలకు ఊతమిచ్చేలా సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటీలు, ఐఐఎంల్లో పరిశోధన ఆధారిత వసతుల కల్పనకు ఈ సంస్థ రూ. 20 వేల కోట్ల నిధులిస్తుంది. 20 లక్షల టన్నులకు పప్పుదినుసుల నిల్వలు దేశంలో పప్పుదినుసుల నిల్వల్ని ప్రస్తుతమున్న 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై నియమించిన కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు.