వరి ‘మద్దతు’ పెంపు | Cabinet hikes minimum support price for paddy by Rs50 | Sakshi
Sakshi News home page

వరి ‘మద్దతు’ పెంపు

Published Thu, Jun 18 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

వరి ‘మద్దతు’ పెంపు

వరి ‘మద్దతు’ పెంపు

నామమాత్రమే..రూ. 50 పెంచిన కేంద్ర కేబినెట్
తెలుగు రాష్ట్రాల రైతులకు నిరాశే
కందులు, మినుములకు రూ. 75 పెంపు, రూ. 200 బోనస్
పెసరకు ఎంఎస్‌పీ రూ. 50 పెంపు, రూ. 200 బోనస్

సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి ధాన్యాగారంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఈసారీ నిరాశే మిగిలింది. వరి ధాన్యానికి మద్దతు ధరను కేవలం రూ. 50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు కామన్ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాలుకు రూ. 1,360 ఎంఎస్‌పీ ఉండగా.. 2015-16 ఖరీఫ్ సీజన్‌కు దానిని రూ. 1,410కి పెంచుతూ ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించింది. అలాగే గ్రేడ్-ఏ రకం ధాన్యం ఎంఎస్‌పీ ఇదివరకు రూ. 1,400 ఉండగా.. ఇప్పుడది రూ. 1,450 కానుంది. వరి ధాన్యం మద్దతు ధర రూ. 1,700 గా నిర్ణయించాలని తెలుగు రాష్ట్రాల నుంచి చాలా రోజులుగా డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్రం నామమాత్రంగానే పెంచటం తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల కొరత ఉన్న కారణంగా ఆయా పప్పు ధాన్యాలకు మాత్రం మద్దతు ధరతో పాటు రూ. 200 బోనస్‌గా ఇవ్వనుంది.

ఇది ఒకింత ఊరటనిచ్చే అంశమే. పెసర, కంది, మినప పంటలకు ఈ బోనస్ ప్రకటించింది. పెరిగిన మద్దతు ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
పెసరకు మద్దతు ధరను రూ. 50 పెంచారు. బోనస్ రూ. 200. మొత్తం కలిపి ఇకపై క్వింటాలుకు రూ. 4,850గా నిర్ణయించారు.
కందికి మద్దతు ధరను రూ. 75 పెంచారు. బోనస్‌గా రూ. 200 ప్రకటించారు. మొత్తం కలిపి ఇకపై క్వింటాలుకు రూ. 4,625 గా మద్దతు ధర ఉంటుంది.
మినుములకు మద్దతు ధరను రూ. 75 పెంచారు. బోనస్‌ను రూ. 200 కలిపి ఇకపై క్వింటాలుకు రూ. 6,625 గా ఎంఎస్‌పీ ఉంటుంది.
వేరుశనగకు ఇప్పటివరకు రూ. 4,030 మద్దతు ధర ఉండగా.. తాజాగా మరో రూ. 30 పెంచారు.
పత్తి, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలకు మద్దతు ధరను రూ. 50 చొప్పున పెంచారు.
మొక్కజొన్న ఎంఎస్‌పీ కేవలం రూ. 15 పెంచుతూ 1,325 గా నిర్ధారించగా.. జొన్నలకు రూ. 40 పెంచారు. రాగులకు రూ. 100 పెంచారు.
మద్దతు ధరల పెంపుకు తోడు కొత్తగా 109 కృషి విజ్ఞాన కేంద్రాలు నెలకొల్పి రైతులకు అండగా నిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధానమైన పంటగా ఉన్న శనగ పంటకు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్రం దీనిని విస్మరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement