పరిహారంగా కాదు... పునర్నిర్మాణం కోసమే
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్
న్యూఢిల్లీ: తాను ఎలాంటి అపరాధ రుసుమూ లేదా పరిహారం చెల్లించనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. యమునా నది తీరంలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక సంగమం రెండో రోజు మాట్లాడుతూ.. సభా ప్రాంగణం పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లు చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కోరిందని... దానిని తప్పుగా ప్రచారం చేశారన్నారు. ‘నేను పవిత్రంగా జీవించాను. ఎప్పుడూ స్కూలుకు ఆలస్యంగా వెళ్లలేదు. ఎప్పుడూ ఫైన్ కట్టలేదు. అందుకే పరిహారం కట్టేది లేదని చెప్పాను’ అని చెప్పారు.
ఈ ప్రాంతం అభివృద్ధి, పునర్నిర్మాణం కోసమేనని ఎన్‌జీటీ చెప్పిందని... అందుకు నిండు మనసుతో అవసరమైన సాయం చేస్తానని తెలిపారు. కాగా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సదస్సు రెండో రోజు కూడా కన్నులపండువగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ప్రాంగణం కళకళలాడింది. అందరినీ ఆకట్టుకునేలా సాంస్కృతిక ప్రదర్శనలు సాగాయి. ఈ సాంస్కృతిక ఉత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.