హిసార్, (చంఢీగఢ్) : చంఢీగఢ్ విశ్వవిద్యాలయ ప్రాంతం 'నేను డ్రగ్స్ తీసుకోను, ఎవరిని తీసుకోనివ్వను' అనే నినాదాలతో మారుమ్రోగింది. మత్తుమందుల రహిత భారతదేశం పేరిట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రారంభించిన కార్యక్రమంలో రెండు రోజులపాటు 60 వేల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, కోటిమంది సామాజికమాధ్యమాల ద్వారా పాల్గొని మత్తుమందులకు వ్యతిరేకంగా పని చేస్తామని ప్రతిన పూనారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శ్రీశ్రీ రవిశంకర్ ప్రసంగించారు. 'మన దేశపు యువతను బలోపేతం చేయాలి. వారిని బలహీనపరిచే మత్తు మందులు వంటి వాటిని నిషేధించాలి. ఆనందం, సరదా, ప్రేమ కోసం ప్రజలు మత్తు పదార్థాల ఊబిలో పడతారు. వాటికి బదులుగా మాతో చేయి కలపండి. మిమ్మల్ని ఎప్పటికీ వీడిపోని ఆనందాన్ని, ప్రేమమత్తును మేం చూపిస్తాం. ఉన్నతంగా ఉండే మనసు మాత్రమే ప్రేమను, ఆనందాన్ని ఇవ్వగలదు' అని పేర్కొన్నారు.
దేశంలో మత్తు మందుల వాడకానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపడుతున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. 'మత్తు పదార్థాల నుండి భారత దేశాన్ని విముక్తం చేసేందుకు శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన కార్యక్రమాలను మన పూర్వకంగా ప్రశంసిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజల హృదయాలలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో నేను గమనించాను. వివిధ వర్గాల ప్రజలు, చలనచిత్ర పరిశ్రమ, క్రీడాకారులు, సామాజిక మాధ్యమాలలో కోట్లాదిమంది ఈ కార్యక్రమానికి చేయూత నివ్వడం ముదావహం' అని మోదీ అన్నారు. ఇది కేవలం మానసిక- సామాజిక- ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, మత్తు మందుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం జాతి వ్యతిరేక శక్తులు, తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని గమనించాలని కోరారు.
చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ సహా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ర్యాప్ గాయకుడు, గేయ రచయిత బాద్షా, హాస్య నటుడు కపిల్ శర్మ, ప్రముఖ పంజాబీ జానపద గాయకుడు గురుదాస్ మాన్, పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ పాల్గొన్నారు. రెండవరోజున హిస్సార్ లో జరిగిన కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో గురుదేవులతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ప్రముఖ నటుడు వరుణ్ శర్మ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రజలను మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచటం కోసం దేశంలోని పట్టణాలు, గ్రామాలలో మార్చి 10వ తేదీన వాకథాన్ నిర్వహించనున్నట్లు గురుదేవ్ శ్రీశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సంజయ్ దత్ మాట్లాడుతూ మత్తు మందుల వలన తాను ఎదుర్కొన్న మానసిక క్షోభను, తాను చేసిన యుద్ధాన్ని వివరించారు. 'నా నోటి నుండి, ముక్కు నుండి రక్తం పడేది. తిండి తినలేక పోయే వాడిని. నన్ను నేను అద్దంలో చూసుకుంటే భయపడేవాడిని. నాకు సహాయం కావాలని మా నాన్నని అర్థించాను' అని గుర్తుచేసుకున్నారు. ఆ అలవాటు నుండి బయటపడ్డ అనంతరం సైతం ఒక మత్తు మందుల వ్యాపారి తనను సంప్రదించినట్లు, ఆ క్షణం నుండే తాను జీవితంలో మరలా వాటి జోలికి పోకూడదని నిర్ణయించుకున్నట్లు సంజయ్‌దత్ తెలిపారు.
దేశవ్యాప్తంగా 12 వేల కళాశాలలోని కోటి మంది విద్యార్థులు అంతర్జాలం (వెబ్ కాస్ట్) ద్వారా జరిగిన కార్యక్రమంలో మత్తుమందులకు వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ పూనారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు బాద్షా మాట్లాడుతూ, మీ జీవితంలో ఉన్నత ఆశయాలను గుర్తుంచుకోమని కోరారు. ఆశయాలు ఉన్నతంగా ఉంటే అవి మిమ్మల్ని మత్తు మందుల వైపు పోకుండా చూస్తాయని అన్నారు. 'నేను ఎప్పుడూ వాడలేదు. కానీ నా మిత్రుడు, అతను నాకంటే బాగా పాడేవాడు. అతడు వీటి బారిన పడ్డాడు, ఇవాళ ఆతడు జీవించి లేడు. నా ఆనందాన్ని సంగీతంలో చూశాను. మీరు మీ ఆనందాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఈ దేశానికి మీరే భవిష్యత్తు' అని బాద్షా అన్నారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని కళాశాలలో స్వాట్ క్లబ్ (సోషల్ వెల్నెస్ అండ్ అవేర్నెస్ ట్రైనింగ్) పేరిట సంఘాలను నెలకొల్పి, వాటి ద్వారా మత్తుమందుల దుష్ప్రభావాలపై అవగాహన కలిగించటం, వాడకుండా నివారించే చర్యలు చేపట్టనున్నారు. డ్రగ్ ఫ్రీ ఇండియా (మత్తుమందుల రహిత భారతదేశం) సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. చలనచిత్ర పరిశ్రమ, క్రీడలు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన 90 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment