న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో మరోసారి చుక్కెదురైంది. జరిమానాగా చెల్లించాల్సిన 4.75 కోట్ల రూపాయల మొత్తానికి నగదుకు బదులుగా బ్యాంక్ గ్యారెంటీ ఇస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తరపు న్యాయవాది చేసిన విన్నపాన్ని మంగళవారం ఎన్జీటీ తిరస్కరించింది. వారంలోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక ఇలాంటి ప్రతిపాదనతో అప్లికేషన్ వేసినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు ఐదు వేల రూపాయలను జరిమానా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ డబ్బును డిపాజిట్ చేయకపోవడాన్ని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ సారథ్యంలోని ధర్మాసనం ఆక్షేపించింది.
ఈ ఏడాది మార్చిలో మూడు రోజుల పాటు యమునా నది ఒడ్డున ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ వల్ల పర్యావరణ సమస్యలు వస్తాయని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతింటుదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన ఎన్జీటీ.. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టాలని ఆదేశిస్తూ, షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అప్పట్లో అనుమతి ఇచ్చింది. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని ఇంతవరకు జమ చేయలేదు.
బ్యాంక్ గ్యారెంటీ కుదరదు.. రూ. 4.75 కోట్లు కట్టాల్సిందే
Published Tue, May 31 2016 6:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM