!['మా సహనంతో ఆటలు ఆడకండి'](/styles/webp/s3/article_images/2017/09/3/71457525189_625x300.jpg.webp?itok=fGHeV-So)
'మా సహనంతో ఆటలు ఆడకండి'
న్యూఢిల్లీ: యమునా నది తీరంలో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ నిర్వహించ తలపెట్టిన 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తీరుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్రంగా విరుచుకుపడింది. సమ్మేళనం కోసం నిర్మిస్తున్న నిర్మాణాలు తాత్కాలికమేనన్న పర్యావరణ శాఖ వ్యాఖ్యలపై మండిపడింది. 'ఇవి తాత్కాలిక నిర్మాణాలు అని మీరు ఎలా అనుకుంటారు? మా సహనాన్నీ పరీక్షించకండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సమ్మేళనం నిర్వహణకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని మీరు ఎందుకు అడుగలేదని పర్యావరణ శాఖను ఎన్‌జీటీ నిలదీసింది. ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు మీ అనుమతులు అవసరం లేదా? ఈ కార్యక్రమంపై ఎవరైనా సమీక్ష జరిపారా? అని మండిపడింది. అలాగే ఈ వ్యవహారంలో క్రియారహితంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని కూడా ఎన్‌జీటీ తీవ్రంగా దుయ్యబట్టింది. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.
మీరెందుకు జాతీయ ప్రాజెక్టులు చేపట్టరు?
ఇక కేవలం రూ. 15.63 కోట్ల రూపాయల బడ్జెట్‌తోనే ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని 'ఆర్ ఆఫ్ లివింగ్' చేసిన వాదనను ఎన్‌జీటీ తోసిపుచ్చింది. కేవలం రూ. 15 కోట్లలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే.. జాతీయ ప్రాజెక్టులను కూడా మీరే చేపట్టాలం'టూ పేర్కొంది. మరోవైపు ఈ సాంస్కృతిక సమ్మేళనం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయరాదని, సంస్కృతి, మతాలు, భావజాలాల ఐక్యత కోసం కృషి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని 'ఆర్ ఆఫ్ లివింగ్' స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కోరారు.