139 కి డయల్ చేస్తే చాలు..!
న్యూ ఢిల్లీః రైలు ప్రయాణీకులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అనుకోని పరిస్థుతుల్లో ప్రయాణం రద్దు అయినపుడు బుక్ చేసుకున్న టికెట్ ను క్యాన్సిల్ చేసుకునేందుకు చివరి నిమిషంలో పరుగులు తీయాల్సిన పని లేదు. గంటలతరబడి లైన్లో నిలబడాల్సిన అవసరమూ లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తాజాగా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు.
బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు డయల్ 139 పద్ధతిని కొత్తగా ఆవిష్కరించారు. చివరి నిమిషంలో స్టేషన్ కు వెళ్ళి, క్యూలో నిలబడి ప్రయాస పడాల్సిన అవసరం లేదుకుండా... ప్రయాణీకులు ఫోన్ చేసి, వారి ట్రైన్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ వంటి వివరాలను అందిస్తే చాలు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ప్రయాణీకులు క్యాన్సిల్ చేసిన వెంటనే వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ను... 'పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' (పీఆర్ ఎస్) కౌంటర్ వద్ద సమర్పిస్తే... ప్రయాణీకులు టికెట్ కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాటు చేశారు.
క్యాన్సిలేషన్ చార్జీలు భారీగా పడుతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు రైల్వే మంత్రి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు కౌంటర్ వద్దకు వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేయకపోతే భారీ జరిమానా పడే పరిస్థితికి తెరపడనుంది. డయల్ 139 సదుపాయంతో అనుకున్న క్షణంలోనే కాల్ చేస్తే సరిపోతుంది. కాస్త తీరిగ్గా వెళ్ళి ఓటీపీని రిజర్వేషన్ కౌంటర్ లో ఇచ్చి డబ్బును వాపస్ తీసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంతో ఓపక్క డబ్బు పూర్తిశాతం తిరిగి పొందడంతోపాటు... క్యాన్సిలేషన్ ప్రక్రియ కూడ సులభం అయ్యింది.