
'మళ్లీ కావేరి చిచ్చు రగులుకుంటోంది'
బెంగళూరు: మరోసారి కావేరి వివాదం రాజుకుంటోంది. రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 27వరకు ప్రతి రోజు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిన్న మరోసారి ఆదేశించిన మాండ్యా ప్రాంత రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీయడమే కాకుండా జలాలు వదులుతూ తమకు ఉరి శిక్ష వేస్తున్నారని ఉరి వేసుకున్నట్లుగా రోడ్డుపై ప్రదర్శనలు ఇస్తున్నారు. మాండ్యా ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. జనతాదల్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయత్, తాలుకా పంచాయతీ నాయకులంతా రాజీనామా చేశారు.
మాండ్యా ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా నోటికి గుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొనే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడా బలగాలను మోహరించడంతో ప్రస్తుతానికి శాంతియుత పరిస్థితులతోనే కనిపిస్తోంది. మరోపక్క, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కర్ణాటక హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కావేరి జలాలు పారే కర్ణాటక అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
నీటి విడుల చేసే చోట కూడా కట్టు దిట్టమైన భద్రతకు హోంమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. కావేరీ జలాలను వదలాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడం కష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులైతే ఇచ్చింది గానీ, తమ దగ్గరే నీళ్లు లేనందున ఆ తీర్పు అమలు కష్టమేనని విలేకరులతో చెప్పారు. వాస్తవానికి పర్యవేక్షక కమిటీ సూచన ప్రకారం అయితే 3వేల క్యూసెక్కులు మాత్రమే వదలాలి. కానీ సుప్రీం మాత్రం తన ఉత్తర్వుల్లో 6వేల క్యూసెక్కుల నీరు పంపాలని తెలిపింది. దీంతో అసలు వివాదం రాజుకుంది.