అక్కడికి లేఖరాసి ఇక్కడ ఎందుకు సోదాలు?
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2013- మార్చి 2014 మధ్య కాలానికి సంబంధించిన చిట్టా పద్దుల వివరాల కోసం తాము ముందుగానే డీడీసీఏను సంప్రదించామని సీబీఐ పేర్కొటుండగా, ఈ వార్తలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. దర్యాప్తు చేయడానికి ముందుగానే ఆడిట్ లెక్కలు సమర్పించాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు లేఖ రాసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. గత అక్టోబర్లో డీడీసీఏ అవినీతిపై ప్రాథమిక విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న డీడీసీఏకు లేఖ రాశారని సీబీఐ చెబుతన్నప్పటికీ ఆ మరుసటిరోజు వారికి లేఖ అందిందని వారే వెల్లడించారని చెప్పారు. అయితే, ఆ మరుసటి రోజే తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ పై వచ్చిన ఆరోపణలు వచ్చాయన్న వంక చూపి సీబీఐ బృందం ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొన్ని బ్లాక్స్లో తనిఖీలు నిర్వహించిందంటూ మండిపడ్డారు. సీబీఐ చేసిన తనిఖీలను కేజ్రీవాల్ తప్పుపట్టారు. డీడీసీఏకు సంబంధించిన పేపర్లు, ఇతర డాక్యుమెంట్ల కోసమే తన కార్యాలయంలో సోదాలు చేశారని ఆరోపించారు. డీడీసీఏకు లేఖ రాసినప్పుడు అక్కడ సోదాలు చేయకుండా ఇక్కడ తన కార్యాలయంలో సోదాలు ఎందకు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మరో అడుగు ముందుకేస్తూ గతంలో డీడీసీఏలో కీలక పదవులు నిర్వర్తించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.