నోయిడా/న్యూఢిల్లీ: సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులు తనిఖీలు, విచారణకు వస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో విచిత్రంగా నిందితుడి బంధువులే సీబీఐ అధికారులకు చుక్కలు చూపించారు. మూకుమ్మడిగా చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అధికారుల స్మార్ట్‌ఫోన్లు, గుర్తింపు కార్డులను లాక్కుని తగలబెట్టారు. చివరికి పోలీసులు సరైన సమయానికి అక్కడకు చేరుకోవడంతో బతుకుజీవుడా.. అనుకుంటూ అధికారులు బయటపడ్డారు. 2014లో యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(వైఈఐడీఏ)కు సంబంధించి రూ.126 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ కేసును తొలుత విచారించిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ వీఎస్ రాథోడ్, ఏఎస్సై సునీల్‌దత్ అవినీతికి పాల్పడ్డారు.
వీరిపై కేసు నమోదు చేసి రాథోడ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో సునీల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో సునీల్ ఇంటిలో సోదాలు నిర్వహించేందుకు ఐదుగురు సీబీఐ అధికారుల బృందం శనివారం సునీల్ సొంతూరు సోన్‌పురాకు చేరుకుంది. అంతలోనే అక్కడ సునీల్ కనిపించడంతో ఆయన్ను అరెస్ట్‌చేసేందుకు అధికారులు యత్నించారు. దీంతో సునీల్ బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా సీబీఐ అధికారులను చుట్టుముట్టి కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఇదే అదనుగా సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, సీబీఐ అధికారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఫిర్యాదుచేయడంతో సునీల్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సీబీఐ అధికారులనే చితకబాదారు!
Published Sun, Feb 24 2019 2:08 AM | Last Updated on Sun, Feb 24 2019 5:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment