
లక్నోలో 100% మార్కులు సాధించిన దివ్యాన్శి జైన్‌కు అభినందన
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాలను సీబీఎస్‌ఈ సోమవారం ప్రకటించింది. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత 5.38 శాతం పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది మెరిట్ లిస్టు ప్రకటించకూడదని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉత్తీర్ణత సాధించని వారి మార్కుల లిస్టులో ఫెయిల్ బదులు ఎసెన్షియల్ రిపీట్ అనే పదం చేర్చనున్నారు.
12వ తరగతి ఫలితాల్లో 92.15 శాతం మంది బాలికలు, 86.19 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత 5.96 శాతం అధికం. 66.67 శాతం ట్రాన్స్‌జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం. 2019లో మొత్తం 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 88.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 11.92 లక్షల మంది 12వ తరగతి పరీక్షలకు హాజరు కాగా, దాదాపు 1.57 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికిపైగా మార్కులు సాధించారు. 38,000 మంది 95 శాతానికిపైగా మార్కులు పొందారు. జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు 98.70 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. కేరళలోని త్రివేండ్రం రీజియన్‌లో అత్యధికంగా 97.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.