
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీరుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ఆర్థికసలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సమర్ధుడైనా ప్రభుత్వం ఆయన సూచనలను విస్మరిస్తోందన్నారు. ‘అరవింద్ సుబ్రమణియన్ మంచి వైద్యులే...అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యాధి ముదిరిపోయింద’ని వ్యాఖ్యానించారు.
ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని మోదీ సర్కార్ అర్థం చేసుకోవడం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని, నిరుద్యోగాన్ని, విపక్షాల వాదనలను..అన్నింటినీ విస్మరిస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. అయితే ఆర్థిక సలహాదారు సూచనలనూ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని విస్మయం వ్యక్తం చేశారు. ‘ మూర్ఖుడైన రోగి మందులను తీసుకోకపోగా..సొంత వైద్యం చేసుకుంటాడ’ని మోదీ సర్కార్ తీరును తప్పుపట్టారు. మరోవైపు ఆర్థిక వృద్ధి పడిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.