
సాక్షి, న్యూఢిల్లీ : గత పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలోని ముగ్గురు మహిళలు, బీజేపీ పాలనలోని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాసిన వ్యాసాలు వివిధ జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి వ్యాసాల్లో ప్రధానంగా చర్చించిన అంశం... మహిళా సాధికారికత. మోదీ నాలుగేళ్ల పాలనలో మహిళాభ్యున్నతి కోసం తీసుకున్న చర్యలను ఆ వ్యాసాలు వివరించాయి. ఇంత మంది మహిళా నేతలు ఒకే అంశంపై వ్యాసాలు రాయడం కాకతాళీయమే కావచ్చు. అయితే.. దీని వెనుక ప్రధాని కార్యాలయం(పీఎంవో) దీర్ఘకాలిక వ్యూహం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎత్తుగడలో భాగమేనా!?
ఎన్డీయే పాలనలో మహిళలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న భావనను తొలగించేందుకు ప్రధాని కార్యాలయం వేసిన ఎత్తుగడలో భాగమే ఈ వ్యాసాలని తెలుస్తోంది. మోదీ పాలనలో మహిళలకు జరిగిన మేలుపై వ్యాసాలు, బ్లాగులు, అభిప్రాయాలు రాయాల్సిందిగా ప్రధాని కార్యాలయం మహిళా మంత్రులకు, బీజేపీ నాయకత్వంలోని రాష్ట్రాలకు చెందిన మహిళా నేతలకు సూచించిందని విశ్వసనీయ వర్గాల కథనం. వీరు రాసే వ్యాసాల ప్రచురణ బాధ్యతను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిందని ఆ వర్గాలు వెల్లడించాయి. పీఎంవో సూచన మేరకు రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు వ్యాసాలు రాశారు. అవి ఆగస్టు20, 30 తేదీల మధ్య ఔట్‌లుక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, ఉమా భారతిలు కూడా వ్యాస రచనకు సన్నద్ధమవుతున్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment