
ఢిల్లీ వీధుల్లో ధర్నాకు దిగుతా: సీఎం
ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కోల్ కతా: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. కేంద్రానికి మూడు నెలలు గడువిస్తున్నాని తమ నిధులను ఇవ్వకపోతే ఢిల్లీ వీధుల్లో ధర్నా చేస్తానని హెచ్చరించారు. కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి వింగ్ సమావేశంలో మాట్లాడుతూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాకు డబ్బులివ్వకుండా పొదుపు చేసి ఖరీదైన సూట్ లు కొనుక్కోవడానికి షాపింగ్ చేస్తున్నారా అని మోదీకి చురకలంటించారు. మంచి పనులు చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని ఖరీదైన సూట్ వేసుకొని కాదని ఆమె విద్యార్థులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో భాగంగా మోదీ రూ.10 లక్షల విలువైన సూటును ధరించారు. ఇది అత్యంత ఖరీదైన సూట్ గా ఇటీవల గిన్నీస్ బుక్ లో స్థానం పొందిన విషయం తెలిసిందే.