నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో బాలనేరస్తుడి విడుదలను తాము వ్యతిరేకించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో బాలనేరస్తుడి విడుదలను తాము వ్యతిరేకించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే సంస్కరణ గృహం నుంచి అతన్ని విడుదల చేయాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్తులు ఇచ్చిందని తెలిపింది. యావత్ దేశాన్ని ఆందోళనపరిచిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసులో మైనర్ నిందితుడైన బాలనేరస్తుడు ఆదివారం విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని విడుదల చేయాలా? వద్దా? అన్నదానిపై తీవ్ర చర్చ నడుస్తున్నది. ఈ విషయమై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు ఖైదీల పునరావాసం అంశం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వస్తుందని తెలిపారు. ఈ విషయంలో తమ బాధ్యత ఏమీ ఉండదన్నారు.
'ప్రస్తుత పరిస్థితుల్లో బాలనేరస్తుడి విడుదలను సూత్రప్రాయంగా కేంద్రప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ విషయమై తమ వాదనను ఢిల్లీ హైకోర్టు ఎదుట వినిపించాం' అని రిజిజు తెలిపారు. ఈ విషయంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేంద్ర వాదనను హైకోర్టుకు నివేదించారని చెప్పారు. మరోవైపు బాలనేరస్తుడి విడుదలకు వ్యతిరేకంగా నిర్భయ తల్లిదండ్రులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. వారు ఆదివారం ఢిల్లీలోని ఇండియాగేటు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.