
న్యూఢిల్లీ : బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ సంప్రదించి కార్యచరణ రూపొందించుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో చంద్రబాబు ఎన్సీపీ అధినేత షరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. కాగా మీడియా సమావేశం మధ్యలోనే ఫరూక్ అబ్దుల్లా లేచి వెళ్లిపోయారు. విమానానికి సమయం అయిపోయిందని వివరణ ఇచ్చారు.
'ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. చంద్రబాబు మమ్మల్ని కలుస్తా అన్నారు. వ్యవస్థలను రక్షించుకోవాలి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలి.ఆ దిశగా ప్రయత్నం చేస్తాం' అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
'సీబీఐ, ఆర్బీఐ వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. దేశాన్ని, వ్యవస్థలను, సంస్థలను ఎలా పరిరక్షించుకోవాలనే అంశం పైనే ప్రధానంగా చర్చించాము. మేము ముగ్గురం కన్వీనర్లుగా వ్యవహరిస్తాం. ఈ లక్ష్యం కోసం కనీస ఉమ్మడి ప్రణాళిక కోసం అన్ని పార్టీలతో చర్చిస్తాం' అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
బీజేపి వ్యతిరేక పార్టీలన్నింటినీ సంప్రదించి అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించుకొంటామని చంద్రబాబు చెప్పారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులతో చర్చించే బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. దేశం తమకు ఎంతో గుర్తింపును ఇచ్చిందన్నారు. తమకు ఎలాంటి ఆశ, కోరికలు లేవని, తమ లక్ష్యం దేశం, సంస్థలు, వ్యవస్థల పరిరక్షణ అని చంద్రబాబు పేర్కొన్నారు.