
రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు చుక్కలు చూపిన చంద్రబాబు
సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇంటర్వ్యూలో పొంతనలేని సమాధానాలు
రాష్ట్ర విభజన విషయంలో వైఖరి తెలుసుకోవడానికి ప్రయత్నించిన సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబు చుక్కలు చూపారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబును.. సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. అసలు విభజన అంశంలో చంద్రబాబు వైఖరి ఏమిటో తెలుసుకోవడానికి.. రాజ్‌దీప్ సర్దేశాయ్ వీలైనంతగా ప్రయత్నించినా, ఏమీ తెలుసుకోలేకపోయారు.
తాను అడిగిన ప్రతీ ప్రశ్నకూ చంద్రబాబు పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో ఆశ్చర్యపోవడం రాజ్‌దీప్ వంతు అయిం ది. చివరకు... ‘‘మిమ్మల్ని పదిహేను నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసినా.. మీరు తెలంగాణకు అనుకూలమా? సీమాంధ్రకు అనుకూలమా? అనేది మాత్రం నాకు అర్థం కాలేదు’’ అంటూ రాజ్‌దీప్ ఇంటర్వ్యూను ముగించారు. అంతేకాదు.. చంద్రబాబు ఇంటర్వ్యూలో ఏమీ తెలుసుకోలేకపోయానంటూ సర్దేశాయ్ ట్విట్టర్‌లోనూ వాపోయారు. ఈ ఇంటర్వ్యూలో కొంత భాగం..
* మీరు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా స్పష్టంగా చెప్పండి?
మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఇది చాలా సార్లు చెప్పాను. మేం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాం. కానీ, జరిగిందేమిటి? వాళ్లు (యూపీఏ) రాష్ట్రాన్ని విభజించిన తీరు ఏమిటి? రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని నాశనం చేస్తున్నారు. వాళ్లు రెండు ప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సామరస్యపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి.
* సామరస్యపూర్వక పరిష్కారం అంటే.. సమైక్యాంధ్రనా? విభజన జరగాలనా?
మేం చెప్పేదేమిటంటే వారి (సీమాంధ్ర ప్రజల) గోడు పట్టించుకోండి. ఇరు ప్రాంతాల ప్రజలను పిలిచి మాట్లాడాలి.
* అఖిలపక్షాల్లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ మాట్లాడింది. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. ఇప్పుడేమో ఇదంతా కుట్ర అని మీరు అంటున్నారు?
నేను చెప్పేదేమిటంటే.. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాళ్ల (సీమాంధ్ర ప్రజల)ను కట్టుబట్టలతో వెళ్లిపొమ్మనలేం. వాళ్ల సమస్యలను పట్టించుకోనప్పుడు వాళ్లని వెళ్లాలని ఎలా అంటాం.
* అంటే తెలంగాణ ఇవ్వొద్దంటారా?
కాదు. దీనిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి.
* తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలంటారా?
అదికాదు నేను చెప్పేది. తెలుగువారందరికీ శాంతి కావాలి. అదే సమయంలో ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కావాలి.
* మిగతా పార్టీల సంగతి సరే. మీరు ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం.. మరి మీరు తెలంగాణ తీర్మానానికి మద్దతిస్తారా? లేదా? స్పష్టంగా చెప్పండి
అదికాదు.. మీకు ఇద్దరు పిల్లలుంటే మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరో ఒకరు మాత్రమే కావాలంటారా?
* ఈ అంశంలో రెఫరెండం పెట్టాలా? మరో అఖిలపక్ష సమావేశం పెట్టాలా?
అసలు ఇప్పుడు దీనంతటినీ నిర్ణయిస్తున్నదంతా ఢిల్లీ నేతలే. అందులో ఆంధ్రప్రదేశ్ వారెవరూ లేరు. అలాంటప్పుడు వారెలా నిర్ణయం తీసుకుంటారు? జేఏసీలు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారితో చర్చించాలి. అధికారంలో ఉన్న సోనియాగాంధీ ఈ సమస్యను సృష్టించారు. కేంద్రం వల్లే రాష్ట్రం రావణకాష్టంలా మారింది. దీనికి కేంద్రమే పరిష్కారం చూపాలి.