న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులు టెలికాం కంపెనీలకు ఇచ్చిన గుర్తింపు వివరాలను ఏడాదిలోపు తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంది. కొత్తగా సిమ్‌లు మంజూరు చేయడానికి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానాన్నే ఉపయోగించాలని సోమవారం చెప్పింది. జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
సిమ్‌కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ తీర్పు చెప్పింది. వినియోగదారులు రీచార్జ్ చేసుకునే సమయంలో వారి వివరాలను మళ్లీ తీసుకోవచ్చని కోర్టు సూచించగా, రీచార్జ్ ఔట్‌లెట్లు అపరిమిత సంఖ్యలో ఉన్నందున ఇది సాధ్యం కాకపోవచ్చని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు.