
అహ్మదాబాద్: గుజరాత్ సెక్రటేరియట్ ఆవరణలోకి చిరుత పులి ప్రవేశించడం తీవ్ర కలకలానికి కారణమయింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయంలోకి సోమవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఓ చిరుత ప్రవేశించింది. మూసి ఉన్న గేటు కింద నుంచి అది లోపలికి వస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డయింది. వెంటనే రంగంలోకి దిగిన 200 మంది ఫారెస్ట్ గార్డులు, అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. చివరికి, సాయంత్రం ఆరు గంటల సమయంలో సెక్రటేరియట్‌ను ఆనుకుని ఉన్న ‘పునీత్ వన్’ ఉద్యానవనంలోని 15 మీటర్ల పొడవైన ఓ కల్వర్టు కింద చిరుత దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. మత్తుమందు ప్రయోగించి బంధించారు. అనంతరం అహ్మదాబాద్ సమీపంలోని ఇంద్రోడా పార్కుకు తరలించారు.