గాంధీనగర్: అడవిలో నుంచి దారి తప్పిన ఓ ఆడ చిరుత 50 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది. గుజరాత్‌లోని ఛోటా ఉదేపూర్ జిల్లా రౌన్‌వాద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత బావిలో పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దాన్ని రక్షించేందుకు మూడు గంటలపాటు శ్రమించారు. బావిలో చిరుత ఐరన్ రాడ్ మీద కూర్చొని ఉండగా దాన్ని బయటకు తీసుకువచ్చేందుకు తాడు సహాయంతో నిచ్చెనను బావిలోకి దించారు. (చిక్కినట్టే చిక్కి పంజా విసిరింది.. )
దీంతో అది నిచ్చెన ఎక్కే క్రమంలో ఒక్కోసారి పట్టు కోల్పోయి కిందికి జారింది. అయినప్పటికీ దాని ప్రయత్నం విరమించకుండా మరోసారి నిచ్చెన ఎక్కుతూ ఎట్టకేలకు బావిలో నుంచి బయటపడింది. అనంతరం తిరిగి అడవిలోకి పారిపోయింది. మరోవైపు చిరుత సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని దాని ఫొటోలను, వీడియోను చిత్రీకరించారు. కాగా అడవుల్లో ఉండాల్సిన చిరుతలు ఈమధ్య తరచూ జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. (అదిగో చిరుత.. మళ్లీ ప్రత్యక్షం!)
Comments
Please login to add a commentAdd a comment