
వాడివేడిగా అన్నాడీఎంకే సర్వసభ్య భేటీ
దేశమంతా ఆసక్తి ఎదురుగా చూస్తున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది.
చెన్నై: దేశమంతా ఆసక్తి ఎదురుగా చూస్తున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి 2200 మందిని ఆహ్వానించారు. ఇన్విటేషన్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు. సమావేశ వేదికపై దివంగత నాయకురాలు జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. దారిపొడవునా జయలలిత, శశికళ ఫ్లెక్సీలు పెట్టారు. ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
పార్టీ సమావేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనకుండా శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వ్యతిరేకీయులకు ఆహ్వానాలు పంపకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీచేస్తానని బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్‌పై అన్నాడీఎంకే శ్రేణులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్లనే దాడి చేసినట్లు వారు చెబుతున్నారు. మొత్తం మీద వాడివేడి వాతావరణంలో పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగుతోంది.