వణుకుతున్న చెన్నై వాసులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి దారుణ హత్యాకాండను మరవకముందే మరో కిరాతకం చోటు చేసుకుంది. నందనం ప్రాంతంలో వేలు అనే రౌడీషీటర్ ను దుండగులు సోమవారం నరికి చంపారు. ప్రత్యర్థి గ్రూపు అతడిని హతమార్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నందనం ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. చెన్నైలో పేరుమోసిన రౌడీషీటర్ సీడీ మణి అనుచరులతో సహా 161 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు స్వాతి హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. నుంగంబాక్కమ్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. హంతకుడు నీలం రంగు చొక్క ధరించివున్నాడని, హత్య చేసిన తర్వాత రైల్వే పట్టాలు దాటి పారిపోయినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.