సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుతూ బీజేపీ ఓటమిని ఆస్వాదిస్తూ ఆప్‌ను అభినందనల్లో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ దీటుగా బదులిచ్చారు. ‘చిదంబరంజీ..బీజేపీని ఓడించే పనిని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందా..లేదంటే పార్టీ పరాజయాన్ని పక్కనపెట్టి ఆప్ విజయాన్ని సంబరంగా జరుపుకోవడం ఏంటి..? నా ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తే ఇక పీసీసీ దుకాణాలను మూసేద్దా’మని శర్మిష్ట ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఉండే వివిధ రాష్ట్రాల ప్రజలు కాషాయ పార్టీని ఓడించడంతో ప్రమాదకర బీజేపీ అజెండాను ప్రజలు తిరస్కరించారని వెల్లడైందని, 2021, 2022లో ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు సరైన ఉదాహరణగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిదంబరం ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్ధానాలకు గాను ఆప్ 62 స్దానాలు దక్కించుకుని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టగా బీజేపీ 8 స్ధానాల్లో గెలుపొందగా కాంగ్రెస్‌కు ఒక్క స్ధానం కూడా దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment