వెనుదిరిగిన చైనా సైన్యం.. మోడీ ఎఫెక్ట్?
ఇన్నాళ్లుగా లడఖ్ ప్రాంతంలో భారత సరిహద్దు దళాలకు కంటిమీద కునుకు లేకుండా పదే పదే కవ్విస్తూ, చొరబాట్లకు పాల్పడుతున్న చైనా సైన్యం.. వెనకడుగు వేసింది. గురువారం నుంచి ఆ ప్రాంతంలో చైనా బలగాలు వెనక్కి వెళ్లడం మొదలుపెట్టాయి. ఇదంతా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్తో భారత ప్రధాని నరేంద్రమోడీ చర్చించిన తర్వాతే జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు తెరదించాల్సిందేనని, అసలు అక్కడి విషయం ఏంటో త్వరగా తేల్చాల్సిందేనని మోడీ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం ఇందుకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు ఉండటం తన పర్యటన మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుందని జింగ్ పింగ్ సైతం ఇదే సందర్భంలో మోడీతో చెప్పారట. దాంతో దాదాపు ఎనిమిది రోజుల తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చాలావరకు సడలిపోయాయి. ఇంతకాలం చైనాతో ఈ సమస్య గురించి ప్రస్తావించడానికే మన దేశం ముందు, వెనక ఆడేది. కానీ ఒక్కసారిగా దౌత్య సంబంధాల విషయంలో ప్రభుత్వం తీరు మారిపోవడం ఇప్పుడు ఉపయోగపడింది. ఎన్నాళ్లనుంచో చైనాతో సరిహద్దు సమస్య నలుగుతున్నా, ఇప్పటికి దానికి ఒక పరిష్కార మార్గం లభించినట్లయింది.