మళ్లీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు
న్యూఢిల్లీ: ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతంలోని భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లి రెండు రోజులైనా గడవకముందే.. చైనా సైనికులు మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. 50 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి.. దగ్గర్లోని ఒక పర్వతంపైకి చేరారని శనివారం అధికార వర్గాలు వెల్లడించాయి. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలు శుక్రవారం భారత భూభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే మరో 300 మంది సైనికులు ఎల్‌ఏసీకి దగ్గరలో కనిపిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.
దాంతో భారత సైనికులు కూడా ఆ ప్రాంతంలో మోహరించడం ప్రారంభించారు. లడఖ్ ప్రాంతానికి చెందిన చివరి గ్రామం చుమర్. ఇది హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతం తమదేనని చాన్నాళ్లుగా చైనా వాదిస్తూ.. తరచుగా చొరబాట్లకు పాల్పడుతూ వస్తోంది. అయితే భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్తో సైనికుల చొరబాటు అంశాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు.దాంతో దాదాపు ఎనిమిది రోజుల తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చాలావరకు సడలిపోయాయని భావిస్తున్న తరుణంలో చైనా బలగాలు మళ్లీ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నాలు ఆరంభించాయి.