
చిరాగ్ పాశ్వాన్
పట్నా: వలస కార్మికుల సమస్యపై లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు సరిగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలు సరిగా పని చేస్తేనే.. కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోగలరని తెలిపారు. ఈ వివరాలను కేంద్రానికి అందజేయడం ద్వారా వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందన్నారు. బిహార్ వెలుపల ఉన్న వలస కార్మికులను రాష్ట్రానికి రప్పించే అంశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చిరాగ్ పాశ్వాన్ సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు తమ పార్టీ కార్యకర్తలు రేషన్‌ను అందజేశారని పాశ్వాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. రాష్ట్రానికి చెందిన కార్మికులకు తగిన సాయం అందేలా చూడాలని కోరారు. అంతేకాక వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని పాశ్వాన్ ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్లలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు నితీష్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని పాశ్వాన్ డిమాండ్ చేశారు. (లాక్‌డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం)