‘శునకంలా జన్మించి.. సైనికుడిగా పదవీ విరమణ పొందుతున్నాయి. సీఐఎస్‌ఎఫ్ కే9 యూనిట్ జాగిలాల వీడ్కోలు కార్యక్రమం. వాటిని ఎన్జీవోలకు అప్పగిస్తున్నాం. ఇన్నాళ్లు సేవలు అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) సైన్యం జాగిలాలకు భావోద్వేగ వీడ్కోలు పలికింది. జెస్సీ, లక్కీ, లవ్‌లీ ఈరోజు అధికారికంగా విధుల నుంచి విరమణ పొందుతున్నారంటూ వాటి ఫొటోలను అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఢిల్లీ మెట్రోకు అనుసంధానం చేసిన సీఐఎస్ఎఫ్ బృందంలో భాగమైన ఏడు జాగిలాలకు అధికారిక లాంఛనాలతో సైన్యం వీడ్కోలు పలికింది.
ఇందులో భాగంగా ఎనిమిదేళ్లుగా ఢిల్లీ మెట్రో పారామిలిటరీ విభాగంలో సేవలు అందించిన శునకాల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు వాటిని వివిధ పతకాలతో సత్కరించడంతో పాటుగా.. మెమొంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇక జాగిలాలకు ఈ విధంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం సీఐఎస్ఎఫ్ చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో జాగిలాల విషయంలో సీఎస్‌ఎఫ్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment