గెలుస్తారని తెలిసీ పోటీ సరికాదు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారని తెలిసి కూడా విపక్షాలు పోటీకి దిగడం సరికాదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు.
- విపక్షాలపై సీఎం చంద్రబాబు విమర్శ
- పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.. వివిధ అంశాలపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారని తెలిసి కూడా విపక్షాలు పోటీకి దిగడం సరికాదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు ఘట్టంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్, జలవనరుల మంత్రి ఉమాభారతి, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజధానికి అటవీ భూమి ఇవ్వాలని కోరా..
కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎం వెల్లడించారు. ఇటీవల అస్వస్థతకు గురైన రాజ్‌నాథ్‌సింగ్‌ను శుక్రవారం కలసి పరామర్శించానని తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానాన్ని 1998లో తానే తీసుకొచ్చానని, కాంగ్రెస్ పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ తానొచ్చాక అందరినీ ఒప్పించానని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం లభించడానికి కారణమైన హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్టు పేర్కొన్నారు. పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ను కలసి రాజధానికి 12,500 హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కోరినట్టు సీఎం తెలిపారు.