
స్వదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు
♦ ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరానికి..
♦ మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబు భౌతికకాయానికి నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ/శంఖవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరానికి బయల్దేరి వెళ్లారు. ఆదివారం కన్నుమూసిన టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పర్వత శ్రీసత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) భౌతికకాయంపై చంద్రబాబు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శంఖవరంలో చిట్టిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిట్టిబాబుకు నివాళులర్పించిన వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తదితరులు ఉన్నారు.