
భువనేశ్వర్: కరోనా వైరస్ (కోవిడ్–19 ) ఆన్‌లైన్ పోర్టల్‌లో తన సోదరి గీతా మెహతా వివరాలను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం నమోదు చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి విచ్చేస్తున్న వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదు చేయడం అనివార్యం. స్వయంగా లేదా ఆత్మీయులు, బంధు వర్గాలైనా ఈ వివరాల్ని నమోదు చేసేందుకు వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరిన 24 గంటల వ్యవధిలో వివరాలు నమోదు చేయాలి. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే భారతీయ చట్టాలు, ఐపీసీ నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా రానుండటంతో ఆమె పూర్తి వివరాల్ని ఆయన స్వయంగా కోవిడ్–19 పోర్టల్‌లో నమోదు చేసి పారదర్శకత చాటుకున్నారు.