
సాక్షి, చెన్నై : చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. పార్క్‌లోకి ప్రవేశించాలంటే వారు తప్పనిసరిగా వివాహ ధృవీకరణ పత్రం చూపించాల్సిందన్న నియమం విధించింది.
కోయంబత్తూర్ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో జంటల వెకిలి చేష్టలు గత కొంతకాలంగా బాగా పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయటంతో అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. పార్క్‌కి వెళ్లే జంటలు తమ వెంట తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ చూపించకపోతే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తారు. తొలుత జంటల ఓటర్ ఐడీ, ఆధార్ తరహాలో గుర్తింపుకార్డులు, ఫోన్ నంబర్లను పరిశీలించాలని భావించారు. కానీ, చివరకు వివాహ ధృవీకరణ పత్రం అయితేనే సబబన్న నిర్ణయానికి వచ్చారు.
అయితే ఈ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిదేనని.. అందుకోసం ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదని వారంటున్నారు. పార్క్‌ను ‘ఫ్యామిలీ బిజినెస్’గా మార్చారంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం అమలయ్యాక విద్యార్థుల తాకిడి బాగా తగ్గిందంటూ సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment