అంతరిక్ష శాస్త్రవేత్త కస్తూరిరంగన్ నేతృత్వంలో ఏర్పాటు
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారత విద్యా విధానానికి కొత్తరూపు తీసుకొచ్చే నిర్ణయంలో భాగంగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో కూడిన కమిటీని హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
కస్తూరిరంగన్‌తోపాటు.. కమిటీలో సభ్యులు గా మాజీ ఐఏఎస్ అధికారి కేజే ఆల్ఫోన్సే కనమ్‌తనమ్, మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ వీసీ రామ్ శంకర్ కురీల్, కర్ణాటక ఇన్నోవేషన్ కౌన్సిల్ మాజీ సభ్య కార్యదర్శి ఎంకే శ్రీధర్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ నిపుణులు టీవీ కట్టిమణి, గువాహటి వర్సిటీ ప్రొఫెసర్ మజర్ ఆసిఫ్, ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మాజీ డైరెక్టర్ కృష్ణ మోహన్ త్రిపాఠి, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ, ముంబైలోని ఎస్‌ఎన్‌డీటీ యూనివర్సిటీ మాజీ వీసీ వసుధ కామత్ ఉన్నారు.
‘దేశవ్యాప్తంగా విద్యా రంగంలో విశేష కృషి చేసిన వారితో కమిటీని ఏర్పాటు చేశాం. దేశంలోని వివిధ రంగాలు, వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న వ్యక్తులతో వైవిధ్యమైన ఈ కమిటీ ఏర్పాటైంది’ అని హెచ్‌ఆర్డీ అధికారులు పేర్కొన్నారు. కాగా, జాతీయ విద్యా విధానంపైనే కొన్నేళ్ల కిందట టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఓ నివేదిక రూపొందించింది.