
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో గత రెండు వారాలుగా వివిధ సరకుల ధరలు పెరగడం ఆయా దేశాలకు ఆనందకర విషయమేమోగానీ భారత్‌కు మాత్రం ఇది మింగుడు పడని విషయం. భారత్ చేసుకునే దిగుమతులపై వీటి ప్రభావం ఎక్కువ పడడమే అందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాలీ మరి కొన్ని నెలలైనా కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. భారత్ ముఖ్యంగా ఖనిజాలు, చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఉందన్న విషయం తెల్సిందే.
వీటి ధరలు పెరగడం వల్ల భారత ప్రభుత్వం ఆర్థిక వనరులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దేశంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు కూడా తగ్గుతాయి. పర్యవసానంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటికే దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ కసరత్తు ఓ సవాల్‌గా పరిణమించనుంది. ఈ ఏడాదిలోనే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు అధిక నిధులను విడుదల చేయడం పెను భారం అయ్యే అవకాశం ఉంది.
చమురు ధరలు అంతర్జాతీయంగా పెరగడం వల్ల దేశంలోని విమానయాన సంస్థలు, రంగుల కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశం దిగుమతి బిల్లులో క్రూడాయిల్ 35 శాతం ఆక్రమించడం వల్ల వీటి ధరలు పెరగడం ఎంత భారం అవుతుందో అంచనా వేయవచ్చు. బారెల్ క్రూడాయిల్ ధర మొన్నటి వరకు 60 డాలర్ల లోపు ఉండగా జనవరి 4వ తేదీన అది 68 డాలర్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసిన 2017, మార్చి నెలలో క్రూడాయిల్ ధర 47.56 డాలర్లు మాత్రమే ఉండింది. ఈలెక్కన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి గడ్డు రోజులు రానున్నావో ఊహించవచ్చు!