యూపీలో కాంగ్రెస్ బస్సు యాత్ర
- ప్రారంభించిన కాంగ్రెస్ అధినే త్రి సోనియా గాంధీ, రాహుల్
- రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి శ్రీకారం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల బస్సు యాత్రను శనివారం ప్రారంభించారు. ‘27 సాల్.. యూపీ బేహాల్’ నినాదంతో ప్రచారం చేయనున్నారు. యూపీలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలపడానికి ఈ యాత్ర 600 కి.మీ కొనసాగనుంది. 27 ఏళ్లుగా యూపీలో కాంగ్రెస్ అధికారంలో లేదు. దీంతో అధికారం సాధించడమే లక్ష్యంగా సభలు, పార్టీ కార్యకర్తలతో నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, యూపీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్, రాజ్ బబ్బర్ కాన్పూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు.
రోజుకు నాలుగు ముఖ్యమైన జిల్లాలో యాత్ర చేపడ్తారు. మొదటి రోజు యాత్ర అనతరం మొరాదాబాద్‌లో బస చేస్తారు. తర్వాత షాహ్‌జాహన్‌పూర్, రాంపూర్, బరేలీలో యాత్ర కొనసాగుతుంది. మూడో రోజు హర్‌దోయ్, కాంనౌజ్, కాన్పూర్‌తో యాత్ర పూర్తవుతుంది. అధికారం సాధించడమే తమ పార్టీ లక్ష్యమని గులాం నబీఆజాద్ చెప్పారు. కుల, మత రాజకీయాలతో ప్రజలను వేరు చేయలేరన్నారు. అన్ని మతాలు కలసి ఉండాలనేదే సోనియా ఇచ్చే సందేశమన్నారు. బీజేపీ, బీఎస్‌పీ, ఎస్‌పీ పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని కుల రాజకీయాలతో ప్రజలను విడగొట్టాయన్నారు.