రాంచీ: జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గన్ తీసుకొని వచ్చి హల్‌చల్ చేశాడు. పలామూ నియోజకవర్గంలోని కోసియారా గ్రామంలో ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.
ఆ వెంటనే త్రిపాఠి తన వద్ద ఉన్న గన్ చేతిలోకి తీసుకొని అక్కడి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. గన్ బయటకు తీయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపాఠిపై బీజేపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకుంటారా అని ఆరోపించారు. తుపాకీ పట్టుకోవడంతో త్రిపాఠి తన విశ్వసనీయతను కోల్పోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ నాథ్ సహదేవ్ పేర్కొన్నారు. బ్యాలెట్ ఎన్నికలను బుల్లెట్‌తో శాసిస్తారా అని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment