సోనియా ఆశీస్సులతో.. కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి ఖర్గే | Shashi Tharoor, K N Tripathi, and Mallikarjun Kharge file Congress nominations | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. బరిలోకి గాంధీ కుటుంబం వీరవిధేయుడు ఖర్గే

Published Sat, Oct 1 2022 5:34 AM | Last Updated on Sat, Oct 1 2022 9:24 AM

Shashi Tharoor, K N Tripathi, and Mallikarjun Kharge file Congress nominations - Sakshi

నామినేషన్‌ అందజేస్తున్న ఖర్గే, పక్కన దిగ్విజయ్, గెహ్లాట్‌; నామినేషన్‌ పత్రాలను చూపిస్తున్న శశి థరూర్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పోరు చివరి క్షణంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్థానంలోకి సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడు, దక్షిణాది దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే వచ్చిచేరారు. సోనియా ఆశీస్సులతో ఆయన అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఖర్గేతోపాటు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్‌ పత్రాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి అందజేశారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పోటీలో చివరకు ముగ్గురు మిగిలారు. అభ్యర్థిగా మల్లికార్గున ఖర్గే పేరును అశోక్‌ గెహ్లాట్, దిగ్విజయ్‌ సింగ్, ప్రమోద్‌ తివారీ, పీఎల్‌ పూనియా, ఏకే ఆంటోనీ, పవన్‌కుమార్‌ బన్సల్, ముకుల్‌ వాస్నిక్‌తోపాటు జి–23 గ్రూప్‌లోని ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ ప్రతిపాదించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఖర్గే వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కనిపించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలో ఆయన విజయం ఖాయమేనని స్పష్టమవుతోంది.

నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు శశి థరూర్‌ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నామినేషన్ల కార్యక్రమానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. వాస్తవానికి ఈ ఎన్నికలో పోటీ చేయడానికి దిగ్విజయ్‌ సింగ్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్‌ పత్రాలను సైతం పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారు. నామినేషన్‌ దాఖలు చేయబోతున్నానని గురువారం ప్రకటించారు. ఇంతలోనే పార్టీ అధిష్టానం వ్యూహం మార్చేసింది. దళిత నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో దిగ్విజయ్‌ వెనక్కి తగ్గారు. తాను పోటీ చేయడం లేదని విస్పష్టంగా ప్రకటించారు. నామినేషన్లకు గడువు శుక్రవారం ముగిసింది. అక్టోబర్‌ 17న జరుగనున్న ఎన్నికలో ఓటు వేయడానికి 9,100 మందికిపైగా ప్రతినిధులను అర్హులుగా గు ర్తించారు. అక్టోబర్‌ 19న ఫలితాలను ప్రకటిస్తారు.  

ఖర్గేకు సీనియర్ల మద్దతు: గెహ్లాట్‌   
అధ్యక్ష ఎన్నికలో ఖర్గేకు మద్దతు ఇవ్వాలని పార్టీ సీనియర్లంతా కలిసి నిర్ణయించారని రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ చెప్పారు. తన మద్దతు ఖర్గేకే ఉంటుందని తెలిపారు. పోటీలో ఎవరు నిలిచినప్పటికీ ఎన్నిక పూర్తయ్యాక అసలు విజేత కాంగ్రెస్సేనని అన్నారు.    

పార్టీలో మార్పు కోసమే నా పోరాటం: ఖర్గే   
కాంగ్రెస్‌ పార్టీలో భారీ మార్పు కోసం తాను పోరాడుతానని, నేతలు, కార్యకర్తలంతా మద్దతివ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.  అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ డెలిగేట్లను కోరారు. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి తనను ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాల్యం నుంచే కాంగ్రెస్‌తో తనకు అనుబంధం ఉందని, పార్టీ ఆదర్శాలను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు మల్లికార్గున ఖర్గే అని సీనియర్‌ నేత ప్రమోద్‌ తివారీ కొనియాడారు.  

మార్పు కావాలనుకుంటే నాకు ఓటేయండి: థరూర్‌  
కాంగ్రెస్‌కు ఖర్గే ‘భీష్మ పితామహుడు’ అని శశి థరూర్‌ ప్రశంసించారు. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్‌కు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఖర్గే, తాను ప్రత్యర్థులం, శత్రువులం కాదని.. తమ మధ్య స్నేహపూర్వక పోటీ జరగబోతోందని చెప్పారు. ఖర్గే పట్ల తనకు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి తనకు ఒక విజన్‌ ఉందని ఉద్ఘాటించారు. ఖర్గే ‘యథాతథ స్థితి కొనసాగింపు నాయకుడేనని’ అన్నారు. పార్టీలో యథాతథ స్థితి కొనసాగాలనుకుంటే ఖర్గేకు, మార్పు కావాలనుకుంటే తనకు ఓటు వేయాలని థరూర్‌ పిలుపునిచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోబోనని  తేల్చిచెప్పారు. 12 రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా సంతకాలు చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్న అశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం ప్రత్యక్షం గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ మద్దతు ఇవ్వబోదని అన్నారు.   

గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు
బెంగళూరు:  సోలిల్లాదా సర్దార(ఓటమి తెలియని నాయకుడు)గా స్వరాష్ట్రం కర్ణాటకలో పేరుగాంచిన మల్లికార్జున ఖర్గే(80) కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలో విజయం సాధిస్తే కర్ణాటక నుంచి ఎస్‌.నిజలింగప్ప తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడైన రెండో నేతగా రికార్డుకెక్కుతారు. అలాగే బాబూ జగ్జీవన్‌ రామ్‌ తర్వాత పార్టీ అధ్యక్షుడైన రెండో దళిత నాయకుడిగా మరో రికార్డు సృష్టిస్తారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన ఖర్గే 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కార్మిక నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత గుల్బర్గా సిటీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలోని గుర్మిత్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మొదటిసారిగా గుల్బర్గా  నుంచి లోక్‌సభకు పోటీ చేసి, విజయం సాధించారు.

2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ భారీ మెజార్టీతో గెలిచారు. 2014 నుంచి 2019 దాకా లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా ఓటమి చవిచూశారు. 2020 జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎగువసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రిగా సేవలందించారు. ఖర్గేకు కర్ణాటక సీఎం అయ్యే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన 1942 జూలై 21న బీదర్‌ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బీఏ, న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement