kn Tripathi
-
కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. అయితే అందులో నుంచి ఓ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి(45) నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల సెట్ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్ వెల్లడించారు. దీంతో బరిలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత శశిథరూర్‌లు నిలిచారు. కేఎన్ త్రిపాఠి.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. జార్ఖండ్ మాజీ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(సొంత వర్గం)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పని చేసిన త్రిపాఠి.. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడీయన. కోషియారా గ్రామంలో బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టగా.. తుపాకీతో కాల్పులకు దిగాడు. అయితే ఆ పరిణామం ఆయనకేం సహకరించకపోగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. మావో ప్రభావిత పాలము జిల్లాకు చెందిన త్రిపాఠి.. లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నారు. ప్రాణహని నేపథ్యంతో ఎన్నికల టైంలోనూ ఆయన ఆ తుపాకీని అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే.. 2009లో దాల్టోన్‌గంజ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. అదృష్టవశాత్తూ 2014లో త్రిపాఠికి మంత్రి బెర్త్ దక్కింది. దీంతో రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, లేబర్ మినిస్టర్‌గా పని చేశారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. తాను రైతు బిడ్డను మాత్రమే కానని, సోనియాకు కూడా కొడుకు లాంటి వాడినేనంటూ ఉపన్యాసం దంచాడు. అందుకే పార్టీ టాప్ పోస్ట్‌కు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు హైకమాండ్ ఏం చెబితే.. అది పాటిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆయన నామినేషన్ వేసి వచ్చిన కాసేపటికే పార్టీలో చర్చ నడిచింది. త్రిపాఠి బరిలో నిలవాంటే.. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ చివరి వరకు ఉంటుందా? అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆయన నామినేషన్ చివరకు తిరస్కరణకు గురైంది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, ఆ తేదీ నాటికి ఒక ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని మధుసుదన్ మిస్ట్రీ తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 19వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. -
సోనియా ఆశీస్సులతో.. కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు చివరి క్షణంలో అనూహ్యమైన మలుపు తిరిగింది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్థానంలోకి సోనియా గాంధీ కుటుంబానికి విధేయుడు, దక్షిణాది దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే వచ్చిచేరారు. సోనియా ఆశీస్సులతో ఆయన అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఖర్గేతోపాటు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి అందజేశారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పోటీలో చివరకు ముగ్గురు మిగిలారు. అభ్యర్థిగా మల్లికార్గున ఖర్గే పేరును అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పూనియా, ఏకే ఆంటోనీ, పవన్‌కుమార్ బన్సల్, ముకుల్ వాస్నిక్‌తోపాటు జి–23 గ్రూప్‌లోని ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ప్రతిపాదించారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఖర్గే వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కనిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన విజయం ఖాయమేనని స్పష్టమవుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు శశి థరూర్ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నామినేషన్ల కార్యక్రమానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. వాస్తవానికి ఈ ఎన్నికలో పోటీ చేయడానికి దిగ్విజయ్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ పత్రాలను సైతం పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారు. నామినేషన్ దాఖలు చేయబోతున్నానని గురువారం ప్రకటించారు. ఇంతలోనే పార్టీ అధిష్టానం వ్యూహం మార్చేసింది. దళిత నాయకుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో దిగ్విజయ్ వెనక్కి తగ్గారు. తాను పోటీ చేయడం లేదని విస్పష్టంగా ప్రకటించారు. నామినేషన్లకు గడువు శుక్రవారం ముగిసింది. అక్టోబర్ 17న జరుగనున్న ఎన్నికలో ఓటు వేయడానికి 9,100 మందికిపైగా ప్రతినిధులను అర్హులుగా గు ర్తించారు. అక్టోబర్ 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఖర్గేకు సీనియర్ల మద్దతు: గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికలో ఖర్గేకు మద్దతు ఇవ్వాలని పార్టీ సీనియర్లంతా కలిసి నిర్ణయించారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. తన మద్దతు ఖర్గేకే ఉంటుందని తెలిపారు. పోటీలో ఎవరు నిలిచినప్పటికీ ఎన్నిక పూర్తయ్యాక అసలు విజేత కాంగ్రెస్సేనని అన్నారు. పార్టీలో మార్పు కోసమే నా పోరాటం: ఖర్గే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పు కోసం తాను పోరాడుతానని, నేతలు, కార్యకర్తలంతా మద్దతివ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ డెలిగేట్లను కోరారు. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి తనను ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బాల్యం నుంచే కాంగ్రెస్‌తో తనకు అనుబంధం ఉందని, పార్టీ ఆదర్శాలను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా పోరాడుతానని అన్నారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు మల్లికార్గున ఖర్గే అని సీనియర్ నేత ప్రమోద్ తివారీ కొనియాడారు. మార్పు కావాలనుకుంటే నాకు ఓటేయండి: థరూర్ కాంగ్రెస్‌కు ఖర్గే ‘భీష్మ పితామహుడు’ అని శశి థరూర్ ప్రశంసించారు. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్‌కు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఖర్గే, తాను ప్రత్యర్థులం, శత్రువులం కాదని.. తమ మధ్య స్నేహపూర్వక పోటీ జరగబోతోందని చెప్పారు. ఖర్గే పట్ల తనకు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి తనకు ఒక విజన్ ఉందని ఉద్ఘాటించారు. ఖర్గే ‘యథాతథ స్థితి కొనసాగింపు నాయకుడేనని’ అన్నారు. పార్టీలో యథాతథ స్థితి కొనసాగాలనుకుంటే ఖర్గేకు, మార్పు కావాలనుకుంటే తనకు ఓటు వేయాలని థరూర్ పిలుపునిచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోబోనని తేల్చిచెప్పారు. 12 రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా సంతకాలు చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్న అశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం ప్రత్యక్షం గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ మద్దతు ఇవ్వబోదని అన్నారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు బెంగళూరు: సోలిల్లాదా సర్దార(ఓటమి తెలియని నాయకుడు)గా స్వరాష్ట్రం కర్ణాటకలో పేరుగాంచిన మల్లికార్జున ఖర్గే(80) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలో విజయం సాధిస్తే కర్ణాటక నుంచి ఎస్.నిజలింగప్ప తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడైన రెండో నేతగా రికార్డుకెక్కుతారు. అలాగే బాబూ జగ్జీవన్ రామ్ తర్వాత పార్టీ అధ్యక్షుడైన రెండో దళిత నాయకుడిగా మరో రికార్డు సృష్టిస్తారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన ఖర్గే 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కార్మిక నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్‌లో చేరారు. తొలుత గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలోని గుర్మిత్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మొదటిసారిగా గుల్బర్గా నుంచి లోక్‌సభకు పోటీ చేసి, విజయం సాధించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంలోనూ భారీ మెజార్టీతో గెలిచారు. 2014 నుంచి 2019 దాకా లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా ఓటమి చవిచూశారు. 2020 జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎగువసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రిగా సేవలందించారు. ఖర్గేకు కర్ణాటక సీఎం అయ్యే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన 1942 జూలై 21న బీదర్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బీఏ, న్యాయ శాస్త్రం అభ్యసించారు. 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేశారు. -
జార్ఖండ్‌లో 64 శాతం పోలింగ్
రాంచీ: జార్ఖండ్‌లో మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం జరిగిన ఈ పోలింగ్‌లో 64.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుమ్లా జిల్లాలో ఓ కల్వర్టు వద్ద నక్సలైట్లు బాంబు పేల్చారని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని అదనపు డీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. దల్తన్గంజ్ నియోజకవర్గంలోని కోసియారాలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి ఆయుధాలతో పోలింగ్ బూత్‌లో ప్రవేశించాలని చూడగా పోలీసులు అడ్డుకొని అతని నుంచి ఓ పిస్టల్, మూడు కాట్రిడ్జ్‌లను సీజ్ చేశామని పలమౌ డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ శాంతను అగ్రహారి తెలిపారు. నక్సల్స్ ప్రభావితం, చలికాలంలో త్వరగా చీకటి పడుతున్నందున ఉదయం 7కు ప్రారంభించి, మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగించినట్లు చెప్పారు. 13 ప్రాంతాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఆరోగ్య శాఖ మంత్రి రామ్ చంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామేశ్వర్ ఓరాన్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ చీఫ్ విప్ రాధాక్రిష్ణ కిషోర్‌లు ఉన్నారు. -
జార్ఖండ్: తుపాకీతో కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్..!
రాంచీ: జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గన్ తీసుకొని వచ్చి హల్చల్ చేశాడు. పలామూ నియోజకవర్గంలోని కోసియారా గ్రామంలో ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ వెంటనే త్రిపాఠి తన వద్ద ఉన్న గన్ చేతిలోకి తీసుకొని అక్కడి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. గన్ బయటకు తీయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపాఠిపై బీజేపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకుంటారా అని ఆరోపించారు. తుపాకీ పట్టుకోవడంతో త్రిపాఠి తన విశ్వసనీయతను కోల్పోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ నాథ్ సహదేవ్ పేర్కొన్నారు. బ్యాలెట్ ఎన్నికలను బుల్లెట్‌తో శాసిస్తారా అని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. -
బెంగాల్ గవర్నర్‌కు మిజోరాం బాధ్యతలు
ఇప్పటికే పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న కేఎన్ త్రిపాఠీకి మిజొరాం అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆయన ఈనెల 4వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శనివారం ఐజ్వాల్ వస్తారని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేస్తారని మిజొరాం ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎల్.ఆర్. సైలో తెలిపారు. కేంద్రప్రభుత్వం గతవారం తొలగించిన పాత గవర్నర్ అజీజ్ ఖురేషి అదేరోజు.. అంటే ఏప్రిల్ 4న రాష్ట్రం వదిలి వెళ్తారు. అయితే.. రాష్ట్రంలో పదే పదే గవర్నర్లను ఎందుకు మారుస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. గడిచిన 8 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏడుగురు గవర్నర్లు మారారు.