అస్తిత్వ సంక్షోభంలో కాంగ్రెస్
పార్టీ నాయకుడు జైరాం రమేశ్ వ్యాఖ్య
► మోదీ, అమిత్‌షాలను కలసికట్టుగా ఎదుర్కోవాలి
►వీరిని ఎదుర్కొనేందుకు సాధారణ వ్యూహాలు సరిపోవు
► దేశం మారుతోంది.. కాంగ్రెస్ పార్టీ కూడా మారాలి
కొచ్చి: కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రధానిమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ సీనియర్లంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ, షాలను ఎదుర్కొనేందుకు సాధారణమైన వ్యూహాలు సరిపోవని, కాంగ్రెస్ సరైన విధానాలను అవలంబించాలని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1996 నుంచి 2004 వరకూ కాంగ్రెస్ అధికారంలో లేనికాలంలో కాంగ్రెస్ ఎన్నికల సంక్షోభాన్ని ఎదుర్కొందని, ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో కూడా పార్టీ ఎన్నికల సంక్షోభాన్ని ఎదుర్కొందని చెప్పారు.
అయితే ప్రస్తుతం పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇది ఎన్నికల సంక్షోభం కాదని, ఇప్పుడు పార్టీ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలో అహ్మద్æపటేల్‌ను గెలిపించేందుకు, బీజేపీ బెదిరింపులు, ఫిరాయింపులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించడంపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఈ నిర్ణయం సరైనదేనన్నారు. గతంలో బీజేపీ కూడా ఇలా ఎమ్మెల్యేలను తరలించిందని గుర్తుచేశారు.
మార్పును గుర్తించాలి..
ప్రస్తుతం భారత్ మారిందనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలని, పాత నినాదాలు, ఫార్మూలాలు పనిచేయవని, మారిన భారత్‌లాగే పార్టీ కూడా మారాలని సూచించారు. కొందరు పార్టీ నేతలు తామింకా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది మారాలని అన్నారు. 2018లో జరిగే కీలక అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే విషయంపై అస్పష్టతను తొలగించాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉందని, ఈ ఏడాది చివరి నాటికి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఇది తన అంచనా మాత్రమే అని పేర్కొన్నారు.