న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనంలోని లోక్‌సభ సభామందిరంలో ప్రతిష్టంచనున్న సెంగోల్ (రాజదండం)పై వివాదం ముదురుతోంది. బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి గుర్తుగా సెంగోల్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భజనపరులు కేవలం తమిళనాడులో రాజకీయ లబ్ధి కోసమే సెంగోల్‌ను తెరపైకి తెచ్చారంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.
‘‘నిజానికి సెంగోల్‌ను మద్రాసు ప్రావిన్స్‌లోని ఓ మత సంస్థ మద్రాసు లో తయారు చేయించి 1947 ఆగస్టులో నెహ్రూకు బహుమతిగా ఇచ్చింది. తర్వాత దాన్ని అలహాబాద్ మ్యూజియానికి తరలించారు. దాన్ని నెహ్రూ రాజదండంగా వాడినట్లు ఆధారాల్లేవు. మోదీ ప్రభుత్వ వాదన బోగస్. సెంగోల్‌పై మోదీ భజనపరులు సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు’’ అన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు దాడి చేస్తోందన్నారు.
సెంగోల్‌ను అవమానించడం దారుణం: షా
సెంగోల్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్‌కు ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘‘అధికార మార్పిడికి ప్రతీకగా తమిళనాడు మఠం నిర్వాహకులు పవిత్ర సెంగోల్‌ను నెహ్రూకు అందజేశారు. దాన్ని ‘చేతికర్ర’గా పేర్కొంటూ కాంగ్రెస్ పాలకులు మ్యూజియంలో పడేశారు’’ అంటూ తప్పుపట్టారు. ఇప్పుడేమో అదే కాగ్రెస్ నేతలు సెంగోల్‌ను దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళనాడు మఠం చరిత్ర బోగస్ అంటూ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం దురదృష్టకరమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. రాజకీయాలకూ ఓ పరిమితి ఉండాలన్నారు. నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బహిష్కరణ పిలుపుతో మన స్వాతంత్య్ర సమరయోధులను విపక్ష నేతలు అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి విమర్శించారు.
తప్పుడు ప్రచారం!
తిరువావదుత్తురై పీఠం
చెన్నై: సెంగోల్ రాజదండంపై తప్పుడు ప్రచారం సాగుతుండడం చాలా విచారకరమని తమిళనాడులోని తిరువావదుత్తురై అధీనం పీఠాధిపతి అంబలావన దేశిక పరమాచార్య స్వామి శుక్రవారం అన్నారు. అధికార మార్పిడికి గుర్తుగా ఈ రాజదండాన్ని లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టులో నెహ్రూకు అందజేశారని చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఫొటోలతోపాటు అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు. ‘‘సెంగోల్‌ను రాజదండంగా వాడలేదన్నది కొందరి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారమే. సెంగోల్ తమిళనాడుకు గర్వకారణం. తిరుక్కురళ్‌తో పాటు తమిళ ప్రాచీన సాహిత్యంలో సెంగోల్ ప్రస్తావన ఉంది’’ అని తెలిపారు.
ప్రారంభోత్సవంపై పిల్... కొట్టేసిన సుప్రీం
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి జరిపేలా ఆదేశించాలన్న పిల్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీన్ని ఎందుకు, ఎలా దాఖలు చేశారో అర్థమవుతోందని న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్. నరసింహలు అన్నారు. విచారణకు స్వీకరించకపోతే పిల్ వెనక్కి తీసుకోవడానికి అనుమతినివ్వాలని కోరినా దాన్ని కొట్టేస్తున్నట్టుగా తెలిపారు. ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయడం రాష్టపతిని అవమానించడమేనని విమర్శిస్తూ ఇప్పటికే 20కి పైగా రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment