
పట్టణ సమస్యలపై పోరాటం
పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్
- భివండీలో కాంగ్రెస్ వినూత్న ఆందోళన
- అంబులెన్స్‌లో రోగిని తీసుకువచ్చి నిరసన
- రోడ్లు మరమ్మతులుచేయించాలని డిమాండ్
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షుడు ప్రవీణ్ పాటిల్ ఆధ్వర్యంలో శనివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ రోడ్ల కిరువైపులా చెత్త పేరుకుపోయిందని, మంచినీటిలో మురుగు కలుస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. రోడ్లు గుంతలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు.
ఈ విషయమై భివండీనిజాంపూర్ షహర్ మహానగర్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. కాగా, ఈ సమస్యలన్నింటిని కళ్లకు కట్టినట్లు చూపించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ప్రాంగణంలోకి అంబులెన్స్‌లో రోగిని తీసుకువచ్చారు. స్కూలు విద్యార్థులు, గోవిందా బృందాలతో ‘ఉట్టి’ కొట్టించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం వారు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వచ్చేృకష్ణాష్టమి, గణపతి నవరాత్రుల లోపు పట్టణంలోని ప్రధాన రహదారులైన దామన్‌కర్ నాక, ఆగ్రా రోడ్, అంజూర్ పాట,ఠాణా రోడ్, పంజరి పట్టి నాక, రాజీవ్‌గాంధీ ఫైల్‌వోర్ రోడ్లలో మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రవాది యువ ఉపాధ్యక్షుడు గుప్తా మనీష్, వాలియా బల్‌వీర్ సింగ్, బోడ భగవాన్, మాత్రే గురునాథ్, గోరే అజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.